
హైదరాబాద్, నిఘా24 : బాలీవుడ్ లో 2013లో వచ్చిన ‘స్పెషల్ 26’ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో హీరో అక్షయ్ కుమార్ తన బ్యాచ్ తో ఐటీ రైడ్స్ అంటూ బడాబాబులకు టోకరా వేస్తుంటాడు. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి తన యజమాని ఇంటికి కన్నం వేశాడు. మరో 8మందితో కలిసి ఓ ముఠాగా ఏర్పడి దోపిడీ పథకం వేశాడు. యజమాని ఇంట్లో ఈ ముఠా సినిమాలో మాదిరిగా నకిలీ ఐటీ దాడులు చేసి అందినకాడికి దోచుకువెళ్లారు. కానీ ఇది సినిమా కాదుగా… దోపిడీ చేసిన 48 గంటల్లోనే పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు.

గచ్చిబౌలి ఐటీ కారిడార్ జయభేరి ఆరంజ్ కౌంటీలో నివాసం ఉండే సుబ్రహ్మణ్యం ఒక రియల్టర్. ఇతని వద్ద జస్వంత్ అనే వ్యక్తి కలెక్షన్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. యజమాని సంపాదన చూసి ఎలాగైనా చోరీ చేయాలని జస్వంత్ పన్నాగం వేశాడు. తమ కార్యాలయం సమీపంలో ఉన్న రెస్టారెంట్ నిర్వహించే తన స్నేహితులు మోహన్, అరవింద్, సందీప్ లతో కలిసి స్పెషల్ 26 సినిమా తరహా దోపిడీకి పథకం వేశాడు.

తన యజమాని ఇంటితో పాటు వివరాలు మొత్తం తన స్నేహితులకు అందజేసి దోపిడీకి పథక రచన చేశాడు. ఇందుకోసం జస్వంత్ స్నేహితుడు అరవింద్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఐదుగురు స్నేహితులను రంగంలోకి దించాడు. ఈనెల 12న నగరానికి వచ్చి తొమ్మిది మంది కలుసుకున్నారు. దోపిడీ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే 13వ తేదీ మధ్యాహ్నం యజమాని సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి ఆఫీస్ కు బయలుదేరిన వెంటనే ఈ ముఠాలోని అరవింద్ మరో నలుగురితో కలిసి కారులో యజమాని ఇంటికి వెళ్లారు. ఐటీ అధికారులమంటూ హడావిడి చేసి ఇంట్లో ఉన్న 1 కిలో 340 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదుతో ఉదయించారు.

సాయంత్రానికి జరిగింది ఐటి దాడులు కాదు… దోపిడీ అని తెలుసుకున్న యజమాని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా ఈ ముఠాలోని ఐదుగురిని 48 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. యజమానికి టోకరా వేసేందుకు పథకం వేసిన జస్వంత్ తో పాటు మరో ముగ్గురు పరారయ్యారు. దొరికిన నిందితుల దగ్గరనుంచి పోలీసులు చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.