
హైదరాబాద్, నిఘా24: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న ట్రైటాన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో భారీ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ట్రైటాన్ సంస్థ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఏకంగా రూ. 2100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ట్రైటాన్ సంస్థ ప్రకటించింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉండనుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ రంగంలో కొత్త పాలసీలను తీసుకువచ్చాయి. కాగా ఈ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న అమెరికాకు చెందిన ట్రైటాన్ తెలంగాణలోని జహీరాబాద్ నిడ్జ్ లో అతిపెద్ద యూనిట్ ను ఏర్పాటు చేస్తుండడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

ఈ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ యూనిట్ ద్వారా మొదటి 5సంవత్సరాల్లో 50వేల వాహనాలను తయారు చేయనుండగా, ఇందులో సెడాన్స్, లగ్జరీ ఎస్యూవిలు, సెమీ ట్రక్కులు ఉండనున్నాయి. కాగా ఇండియా నుంచి ఇప్పటికే ట్రైటాన్ కు 2.2 బిలియన్ల ఆర్డర్లు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం సైతం 3వేల ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం.