
గచ్చిబౌలి: నగరంలో కరోనా విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు.. చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతోంది. తాజాగా గచ్చిబౌలి కొండాపూర్ లో గల జిల్లా ఆసుపత్రిలో 10 మంది వైద్య సిబ్బందితో పాటు హాస్పిటల్‌కి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో మొత్తం 14 కరోనా కేసులు నమోదు కావడంతో ఆస్పత్రి వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే కొండాపూర్ జిల్లా ఆసుపత్రి సూపరెండేంట్ సైతం కరోనా పాజిటివ్ తో ఐసోలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. సూపరెండేంట్ తో కాంటాక్ట్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా మొత్తం 14 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గత కొన్ని రోజులుగా కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రం కొనసాగుతుండగా, విధులు నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బంది వెనకాడుతున్నారు. కాగా పాజిటివ్ వచ్చిన వారికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో మరోసారి పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఆస్పత్రిలో పని చేసే వైద్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.ఆస్పత్రితోపాటు పరిసరాల్లోనూ క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.