
హైదరాబాద్, నిఘా24: “ఐటి కారిడార్ కు అనుకొని ఉన్న బసవతారక నగర్. బుధవారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచింది. పనులకు వెళ్లేందుకు పెద్దలు, బడులకు వెళ్లేందుకు పిల్లలు సిద్దమవుతున్నారు. మహిళలు వంట పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో 9గంటల ప్రాంతంలో పోలీసుల సైరన్ లు బస్తీని చుట్టుముట్టాయి. బస్తీవాసులు తెరుకునేలోపే జెసీబిలు కదం తొక్కాయి. ఉదయం ప్రశాంతంగా నిద్రలేసిన బసవతారక నగర్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఆనవాళ్లు లేకుండా కనుమరుగయింది. పొట్టకూటి కోసం రెండు దశాబ్దాల క్రితం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలు దెబ్బకు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.”

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబరు 37లో ఉన్న ప్రభుత్వ స్థలంలో గత రెండు దశాబ్దాల క్రితం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఆవాసాలు ఏర్పాటు చేసుకొని, స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గుడిసెలు, పాక్షిక నిర్మాణాలతో ఇక్కడి పేదలు ఇళ్ళు నిర్మించుకోగా, ఈ బస్తీకి బసవతారక నగర్ అని పేరు వచ్చింది. దశాబ్దాలుగా వీరి పక్కా ఇళ్ల కళ కలగానే మిగలగా, ప్రజాప్రతినిధుల హామీలు అమలుకు నోచుకోక గుడిసెలే వీరికి దిక్కయ్యాయి. కాగా ఐటీ కారిడార్ కు ఆనుకుని రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోని 6 ఎకరాల్లో వెలసిన ఈ బస్తీపై ప్రభుత్వం కన్ను పడింది. ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వ స్థలాల వేలం కోసం సర్వే నెంబర్ 37లో ఉన్న బసవతారక నగర్ ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

అనుకున్నదే తడవుగా బుధవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బసవతారక నగర్ కూల్చివేత చేపట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా పోలీసు బందోబస్తు మధ్య జెసిబి లతో కూల్చివేతలు చేపట్టారు.

మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఈ కూల్చివేతల్లో బస్తీలో ఉన్న మొత్తం 220 పాక్షిక నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. ఇళ్లల్లో ఉన్న ఉన్న సామాగ్రిని బయటపెట్టి కూల్చివేతలు చేపట్టడంతో కట్టుబట్టలతో పేదలు రోడ్డున పడ్డారు. 500 మంది పోలీసు సిబ్బంది భద్రత మధ్య 10 బృందాల రెవెన్యూ అధికారులు 12 జెసిబిలతో కూల్చివేతను చేపట్టారు.

నేతలు ఇచ్చిన సొంతింటి కల నెరవేరక పోగా… ఉన్న ఇల్లు సైతం కూల్చివేయడంతో పేదల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బస్తీవాసులు తమ ఆవాసాల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్నా చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. తోపులాటలో ఇద్దరు బస్తీవాసులు స్పృహ తప్పి పడిపోగా, కళ్ళముందే తమ నివాసాలను కూల్చి వేస్తుండడంతో మరో ఇద్దరు పేదలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.


అధికారుల కూల్చివేతలు, స్థానికులు ఆందోళనతో బసవతారక నగర్ ఉద్రిక్తంగా మారింది. బసవతారక నగర్ కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజేంద్రనగర్ ఆర్డిఓ చంద్రకళ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగగా, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఏసిపి రఘునందన్ భద్రతను పర్యవేక్షించారు. సంవత్సరాలుగా ఉంటున్న పేదలకు ప్రత్యామ్నాయ నివాసం చూపించకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

