
శేరిలింగంపల్లి, నిఘా 24 : దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు హైటెక్ నియోజకవర్గం శేరిలింగంపల్లి లో పక్కదారి పడుతోంది. నియోజకవర్గ పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు చేరుతుంది. పేద ప్రజలకు చేరవలసిన దళిత బంధు ఖరీదైన కార్లలో తిరిగే, బహుళ అంతస్థుల భవనాలు ఉన్న అధికార పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధుల అనుచరులకు అందజేస్తున్నారు. దీంతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న దళిత బంధు పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన కార్లన్నీ అధికార పార్టీ నాయకుడి షో రూమ్ కే కట్టబెట్టడం ఆరోపణలకు కారణమవుతుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధులో భాగంగా 100మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. డివిజన్ కు 10మంది చొప్పున ఎంపిక చేయగా, లబ్దిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారుతుంది.

అధికార పార్టీ నాయకులే లబ్దిదారులు…
దళిత బంధు లబ్దిదారుల జాబితా మొత్తం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయిందని, పేద దళితులకు చెందాలసిన నిధులను పార్టీ నాయకులకు పంచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైటెక్ సిటీ పరిధిలో భారీ బహుళ అంతస్థుల భవనాలు ఉండి, ఖరీదైన కార్లలో తిరిగే నాయకులకు దళిత బంధు కార్లను పంపిణీ చేయడం, కేవలం అధికార పార్టీకి పనిచేసే వారినే ఎంపిక చేసి ఈ పథకం కింద పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో జరుగుతున్న అవకతవకల కారణంగా నియోజకవర్గ పరిధిలోని పేద దళితులు నష్టపోతున్నారు. హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లిలో ఇక్కడి స్థానికులతో పాటు దశాబ్దాల క్రితం వలసవచ్చి, చాలిచాలని ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులు ఎంతోమంది ఉండగా, అటువంటి వారికి దళిత బంధు అందజేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వాపోయారు.

ఒకే షో రూమ్ నుంచి దళిత బంధు కార్లు…
మరోవైపు శేరిలింగంపల్లిలో ఎంపిక చేసిన లబ్దిదారుల్లో సగానికి పైగా ఈ పథకం కింద కార్లు తీసుకుంటున్నారు. ఈ కార్ల పంపిణీ మొత్తం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కార్ల షో రూమ్ నుంచి కొనుగోలుకు ఆర్డర్ చేయడం విశేషం. రెండు నెలల క్రితమే నిధులు విడుదలైనా, ఇతర షో రూమ్ లు వెంటనే కార్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా మందకొడిగా కార్లను డెలివరీ చేస్తున్న అదే షో రూమ్ కు అర్దర్లు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శేరిలింగంపల్లిలో దళిత బంధు పథకంలో మంజూరైన వాహనాల్లో 90శాతం ఒకే షో రూం నుంచి బయటకు రావడం విశేషం. మరోవైపు సదరు షో రూమ్ నిర్వాహకులు లబ్దిదారులకు సమయానికి కార్లు డెలివరి చేయకుండా, నెలల తరబడి తిప్పించుకుంటున్నారు.