
హైదరాబాద్, నిఘా24: కోవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుండి అమలులోకి వచ్చిన లాక్ డౌన్ తో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై 58,050 కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతి లేకుండా బయటకు వచ్చిన 15,817 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
దీంతోపాటు కోవిడ్ నిబంధనలను పాటించకుండా మాస్కూలు సక్రమంగా ధరించకుండా తిరుగుతున్న 20,140 మందికి జరిమానాలు వేశారు. వీటితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వ్యక్తిగత దూరం పాటించనందుకు 1,914 కేసులు, ఎక్కువ మంది గుమిగూడిన కారణంగా మరో 791 కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని, అనుమతి ఉన్నవారు మాత్రమే లాక్ డౌన్ సమయంలో బయటకు రావాలని సైబరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ సూచించారు.