
గచ్చిబౌలి, నిఘా 24: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కస్టడీ మరణం చోటుచేసుకుంది. ఓ గొడవ విషయంలో పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తి మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని నానకరంగూడలో గల నిర్మాణ సంస్థ లో బీహార్ నుంచి వచ్చిన నితీష్(32) సెక్యురిటి గార్డుగా పనిచేస్తున్నాడు. సదరు సంస్థ లేబర్ క్యాంప్ లో శనివారం రాత్రి కూలీలు, సెక్యురిటి గార్డులకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటన మీద కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు శనివారం అర్ధరాత్రి నితీష్ తో పాటు మరో ఇద్దరు సెక్యురిటి గార్డులను పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు. కాగా పోలీసు స్టేషన్ లో ఉన్న నితీష్ ఆదివారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే పోలీసులు పోలీసు స్టేషన్ ముందు ఉన్న హిమగిరి ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే నితీష్ మృతిచెందాడు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ శిల్పావల్లి మాట్లాడుతూ… ఓ కేసు విషయంలో పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తి గుండెనొప్పితో పోలీసు స్టేషన్ లో పడిపోయాడని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ విషయం కస్టడీ డెత్ కిందకు వస్తున్న కారణంగా బాలానగర్ కు చెందిన ఏసీపీ తో దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు.