
శేరిలింగంపల్లి, నిఘా 24: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపింది కమ్యూనిస్టులేనని, చరిత్రలో మరిచిపోలేని ఘట్టంగా తెలంగాణ సాయుధ పోరాటం నిలిచిపోతుందని సీపీఎం జిల్లా నాయకులు సామెల్, తారనగర్ తుల్జాభవాని ఆలయం చైర్మన్ మల్లికార్జున శర్మలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బైక్ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా చందానగర్ గాంధీ విగ్రహం వద్ద సీపీఎం అధ్వర్యంలో ఆదివారం సభ నిర్వహించారు. సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి చల్లా శోభన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
పాల్గొన్న సామెల్, మల్లికార్జున శర్మలు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన వీరోచిత పోరాటo సాయుధ పోరాటం అని అన్నారు.

సాయుధ పోరాటంలో దాదాపు 4వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారన్నారు. పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి మహత్తర పోరాటాన్ని కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. నిజాం సర్కారుకు, భూస్వాములకు వ్యతరేకంగా జరిగిన మహోన్నత పోరాటం అని అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వి.మాణిక్యం, కె. కృష్ణ, వరుణ్, జగదీశ్, రాజు, శ్రీనివాసరెడ్డి, అభిషేక్ నందన్ తదితులు పాల్గొన్నారు.