
హైదరాబాద్, నిఘా24: వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ హైదరాబాదులో జూన్ 6వ తేదీన అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. నగరంలోని మాదాపూర్ హైటెక్స్ లో జూన్ 6వ తేదీన ఒకే రోజు 40 వేల మందికి వ్యాక్సిన్ వేసేందుకు మెగా డ్రైవ్ ను ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్స్ లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 500 కౌంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు.

సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ, మెడికవర్ హాస్పటల్ ల ఆధ్వర్యంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, 18 ఏళ్లు నిండిన వారందరూ అర్హులని నిర్వాహకులు తెలిపారు. మెగా డ్రైవ్ లో పాల్గొని వ్యాక్సిన్ వేసుకోవాలి అనుకునేవారు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి మెడికవర్ హాస్పిటల్ నుంచి టైం స్లాట, క్యూఆర్ కోడ్ మెసేజ్ వస్తుంది. జూన్ 6వ తేదీన ఎటువంటి వెయిటింగ్ లేకుండా కౌంటర్ లో కోడ్ స్కాన్ చేసి వ్యాక్సిన్ పొందవచ్చు.