
హైదరాబాద్, నిఘా24: కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ బాధితులు, వారి సంబంధీకులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించడంతోపాటు 24 గంటలు అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ నెంబరుతో స్వచ్ఛందంగా ‘మిషన్ శ్వాస’ ముందుకు వచ్చింది. www.swaasa.org పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సైట్ లో కోవిడ్ రోగులకు, వారి సంబంధీకులకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెస్టింగ్ సెంటర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు, చిరునామాలను అందుబాటులో ఉంచారు.
దీంతోపాటు అత్యవసరమైన కోవిడ్ రోగులకు ఫోన్ కాల్ తో అంబులెన్స్ సేవలు పొందే విధంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సుల వివరాలు, ఫోన్ నెంబర్లను నిక్షిప్తం చేశారు. నేడు నగరాల్లో కరోనా కాటుకు చనిపోతున్న వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి సంబంధీకులు, కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులును దృష్టిలో ఉంచుకొని అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు, స్మశాన వాటికల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నేడు ఎన్నో సదుపాయాలు ఉన్నా సమాచార లోపంతో ఎంతోమంది ప్రాణాలు పోతుండడంతో ఆపద సమయంలో ఒక్క ఫోన్ కాల్ తో సేవలు అందుకునే విధంగా పూర్తి సమాచారాన్ని ఏర్పాటు చేశారు.
www.swaasa.org వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాలతో పాటు 24 గంటల పాటు అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 888-666-8433 ద్వారా సైతం కోవేట్ బాధితులకు స్వచ్చందంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. మనకు కావాల్సిన సేవలు, మన ప్రాంతం నమోదు చేస్తే పూర్తి వివరాలు మన ముందు ఉంటున్నాయి.
