
నిఘా, హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను కలవరపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ కరోనా వైరస్ దేశంలోకి కూడా ఎంటరైందని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించింది.
ఇటీవల బెంగళూర్ కు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి, 46 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. వీరిద్దరు సౌతాఫ్రికా నుంచి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దాదాపు 30 దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓమిక్రాన్ జాబితాలో ఇండియా కూడా చేరింది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వేరియంట్ ఐదు రెట్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.