
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుండగా, అధికారుల్లో అదే స్థాయిలో సమన్వయం కొరవడుతుంది. ఓ వైపు ఉన్న వసతులను సక్రమంగా ఉపయోగించుకోకుండా, మరో వైపు పాజిటీవ్ వచ్చిన వారికి సరైన చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి పరిధిలో అధికారుల మధ్య కొరవడిన నిఘా స్పష్టంగా కనిపిస్తోంది. శేరిలింగంపల్లి పరిధిలోని కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులో ఉన్నా, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. కరోనా రోగులకే కాదు, సాధారణ వ్యాధులతో వచ్చే వారిని సైతం ఇక్కడి ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో కొండాపూర్ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయి. మరోవైపు శేరిలింగంపల్లి పరిధిలో పాజిటీవ్ వచ్చిన వారికి సరైన వైద్యం అందడం లేదు. పాజిటీవ్ వచ్చిన పలువురిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచిన అధికారులు, వారి బాగోగులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. హఫీజ్ పేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ రాగా, సదరు వ్యక్తిని ఆసుపత్రి తరలించి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతని కుటుంబంలోని 4గురికి పాజిటివ్ గా తేలింది. వీరిని హోమ్ ఐసోలేషన్ పేరుతో వారి ఇళ్లలొనే ఉంచిన అధికారులు, వారి పర్యవేక్షణ గాలికి వదిలేశారు. బాధితుల్లో 60ఏళ్ళు పైబడిన వృద్ధురాలు ఉండడంతో వారు భయంభయంగా కాలం గడుపుతున్నారు. అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోగా, తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. కరోనా బాధితులను పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.