
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు అన్ని సెంటర్ల నోడల్ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీనితో గురువారం నుంచి అన్ని సాంపిల్ సెంటర్లలో అనుమానితుల నుంచి సాంపిల్ తీసుకోవడం నిలిపివేశారు. గత 5 రోజులుగా 10 వేల సాంపిల్స్ టెస్టింగ్ కోసం ల్యాబ్ లలో పెరుకుపోయాయని, పాత సాంపిల్స్ టెస్టింగ్ పూర్తి అయ్యే వరకు కొత్త సాంపిల్స్ తీసుకోవద్దని నిర్ణయించినట్టు సమాచారం. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే సోమవారం నుంచి సాంపిల్స్ తీసుకొనే అవకాశం ఉందని సాంపిల్ సేకరణ సెంటర్ల అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా అనుమానిత ప్రజలు సాంపిల్ కలెక్షన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమానితులు తమకు వ్యాధి ఉందొ.. లేదో తెలియక, ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.