
హైదరాబాద్, నిఘా24: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా రోగుల మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీళ్లు ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో… ప్రజల మధ్య తిరుగుతున్నారో… అనే భయాందోళనలు నెలకొన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనే కరోనా పాజిటివ్ వచ్చి, చికిత్స కు అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య దాదాపు 3వేల వరకు ఉంటుందని అనధికార లెక్కలు చెప్తున్నాయి. కరోనా అనుమానితులు పరీక్షల సమయంలో ఫోన్ నెంబర్, అడ్రెస్ ఇస్తే పరిక్ష నిర్వహిస్తున్నారు. కాగా పరీక్ష రిపోర్టు వచ్చిన తరువాత వారి ఫోన్ కు అధికారులు సమాచారం అందిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని సమాచారం అందిన వెంటనే కొందరు అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. వీరికి చికిత్స నిమిత్తం ఫోన్ చేస్తే స్పందన ఉండడం లేదు. ఈ విదంగా గ్రేటర్ లో రోజుకు 20 మంది వరకు మిస్సింగ్ అవుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 3వేల మంది ఈ విదంగా అధికారులకు అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తుంది. తమకు కరోనా పాజిటివ్ అని బయట తెలుస్తుందని భయపడుతున్న కొందరు ఈ విదంగా ఫోన్లు బందు పెట్టి, అందుబాటులో లేకుండా పోతున్నారని భావిస్తున్నారు. కొందరు ఇళ్లలో ఉండి సొంత వైద్యం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇటువంటి వారి చిరునామాను తెలుసుకునేందుకు అధికారులు మొబైల్ నెట్వర్క్ ల సహాయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు పాజిటివ్ వచ్చి, లక్షణాలు తక్కువగా ఉన్నవారిని హోంక్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తుండగా, వీరు సైతం బాధ్యత లేకుండా బయట తిరుగుతున్నట్టు సమాచారం. రోజువారీ హెల్త్ కండిషన్ కోసం హోం క్వారంటైన్ రోగులకు ఫోన్ చేస్తే తాము బయట ఉన్నామని కొందరు చెప్తున్నట్టు అధికారులు వాపోతున్నారు. గ్రేటర్ ప్రజలారా… కరోనా పాజిటివ్ వచ్చిన కొందరు యథేచ్ఛగా ప్రజల మధ్యే తెరుగుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త.