
హైదరాబాద్, నిఘా24 : కరోనా బారిన పడిన రోగులను గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రులు నిలువునా దోచుకుంటున్నాయి. రోజుకో సంఘటన వెలుగుచుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన కనబడకపోవడంతో భాదితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజాగా నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రి నిర్వకంపై భాదితులు కోర్టులో కేసు వేశారు. కొండాపురం మోహన్ బాబు అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులు ఈ నెల 13వ తేదీన కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. 2 లక్షల రూపాయలు చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో అప్పటికప్పుడు 1.5 లక్షలు చెల్లించారు. అనంతరం చికిత్స జరుగుతుందని, మరికొంత డబ్బు కట్టాలని చెప్పడంతో 18వ తేదీన మరో 1లక్ష రూపాయలు చెల్లించారు. మూడు రోజుల తరువాత మోహన్ కు సీరియస్ గా ఉందని, కుటుంబ సభ్యులను ఆసుపత్రికి రావాలని ఫోన్ చేయడంతో వారు వెళ్లారు. కాగా అప్పటికే మోహన్ మృతిచెందాడని చెప్పిన ఆసుపత్రి వారు, మొత్తం 8.90లక్షల బిల్లు చేతిలో పెట్టారు. వారు కట్టిన 2.5 లక్షలు పోను, మిగిలిన 6.40లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని, లేదంటే కుటుంబ సభ్యుల మీద పోలీసు కేసు పెడతామని బెదిరించారు. తాము 2.5లక్షలు కట్టినా ప్రాణాలు కాపాడకుండా, మిగిలిన డబ్బు చెల్లించాలని వేధిస్తుండడంతో, భాదితులు తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు.