
హైదరాబాద్, నిఘా24: ఏకంగా 3నెలల పాటు కరోనా తో పోరాడి విజయం సాధించింది నగరానికి చెందిన 36ఏళ్ల మహిళ. 3నెలల క్రితం కరోనా సోకి విషమ స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళ 90 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుని మహమ్మారిపై విజయం సాధించింది. ఆసుపత్రిలో ఉన్న మూడు నెలల్లో 45 రోజుల పాటు ఎక్మో చికిత్స తీసుకోవడం విశేషం. నగరానికి చెందిన 36 సంవత్సరాల మహిళకు 3నెలల క్రితం కోవిడ్ సోకింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం, శ్వాస సమస్య ఉండడంతో మే 11వ తేదీన కుటుంబ సభ్యులు ఈమెను మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ డాక్టర్ గనశ్యామ్ ఎం జగత్కర్ ఆధ్వర్యంలో మహిళకు చికిత్స ప్రారంభించారు. మొదట అమెకు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ పంపినా, ప్రోన్ పోసిషన్(బోర్లా) పడుకోపెట్టి ఆక్సిజన్ పంపినా తన ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడలేదు. దీంతో ఎక్మో సపోర్ట్ తీసుకోవడం ప్రారంభించారు. ఎక్మో సపోర్ట్ మీద 41 రోజులు ఉండగా ఆరోగ్యం మెరుగుపడక పొగా, ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒకానొక సమయంలో మహిళ బ్రతకటం కష్టం అని డాక్టర్లు, కుటుంబ సభ్యులు భావించారు. మరోవైపు డాక్టర్లు చివరి వరకు ప్రయత్నించాలని నిర్ణయించి చికిత్స కొనసాగించారు. ఈ సమయంలో కిడ్నీల సమస్య రావడంతో డయాలిసిస్ చేశారు. ఆరోగ్యం కొద్దిగా మెరుగవడంతో 41 రోజుల ఎక్మో సపోర్ట్ ను తొలగించి వెంటిలేటర్ మీద ఉంచారు. ట్రక్యోస్టమీ పద్ధతి ద్వారా హై ఫ్లో కృతిమ శ్వాస పంపడంతో ఆరోగ్యం మరింత మెరుగుపడింది. చాలా రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్ పై ఉండటంతో కండరాలు బలహీనపడి కూర్చోవటానికి, నిలుచోవటానికి ఇబ్బంది పడినా, క్రమం తప్పకుండా ఫీజియోథెరఫితో ఈ సమస్యను జయించింది. 90 రోజుల పాటు కరోనా మహమ్మారితో ఆసుపత్రి బెడ్ మీద ఉండి పోరాడిన మహిళ చివరికి మంగళవారం డిశ్చార్జి అయ్యింది.