
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నా, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమాకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాము ఆదర్శంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతం చెయ్యాలసిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యక్రమాల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం అవసరం ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు సూచిస్తుండగా, ఎమ్మెల్యేలు మాత్రం మంది, మార్బలంతో శంకుస్థాపనలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, మస్కులు పెట్టుకోకుండా, వ్యక్తిగత దూరాలు పాటించకుండా నిర్వహిస్తున్న కార్యక్రమాలు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. వైరస్ ఒకరినుంచి మరొకరికి సోకడానికి ఒక నిమిషం చాలు. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీ కార్యక్రమం విమర్శలకు కారణం అవుతుంది. కార్యకర్తలను భారీగా ఒకేచోట సమీకరించి, వారి మధ్య వ్యక్తిగత దూరం పాటించకుండా, కనీసం మాస్కులు ధరించకపోవడం కనిపించింది. కొందరివద్ద మాస్కులు ఉన్నా అవి నామమాత్రంగా గొంతు కిందే ఉండిపోయాయి. దాదాపు 20 నుంచి 30మంది పక్కపక్కనే ఉన్నా, కేవలం ఎమ్మెల్యే గాంధీ మరో ఒకరిద్దరు మాత్రమే మాస్కులు ధరించి కనిపించారు. ఏదైనా జరిగిన తరువాత ఆలోచించే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉందని, కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం ఉంటేనే కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు.