
చందానగర్,నిఘా24: చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో సుడిగాలి పర్యటనలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, చందానగర్ డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టిన టిఆర్ఎస్ పార్టీ, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు తన ప్రచార అస్త్రాలని తెలిపారు. చందానగర్ లో టిఆర్ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగర వేయడం ఖాయమన్నారు. డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతూ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
