
హైదరాబాద్, నిఘా24: కరోనా లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకు, అధికారులు కోవిడ్ నివారణ చర్యల్లో నిమగ్నమైతే… చందానగర్ కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు మాత్రం తన అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పనిలో పడ్డాడు. జిహెచ్ఎంసి అధికారులు పనులను అడ్డుకున్నా, నోటీసులు జారీ చేసినా లెక్కచేయకుండా కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో ఏకంగా ఐదు అంతస్తుల అక్రమ నిర్మాణం చేపట్టాడు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ కృషితో సదరు అక్రమ నిర్మాణం చేపడుతున్న నాయకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు జిహెచ్ఎంసి ఫిర్యాదు చేసింది.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని చందానగర్ సర్కిల్ ఆదర్శ నగర్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 53 లో అధికార పార్టీకి చెందిన నాయకుడు బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. కాగా ఈ నిర్మాణం అనుమతులకు వ్యతిరేకంగా, అక్రమంగా చేపడుతున్నారంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో సదరు నిర్మాణంపై వివాదం కోర్టుకు చేరడంతో కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. జీహెచ్ఏంసీ అధికారులు సైతం అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని గత డిసెంబర్ 16వ తేదీన, ఈ సంవత్సరం జనవరి 2వ తేదీన, మే 29వ తేదీన నోటీసులు జారీ చేశారు.

కానీ నోటీసులను లెక్కచేయకుండా, లాక్ డౌన్ వేళ నిర్మాణం కొనసాగింది.దీంతో కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారులు పై చట్టప్రకారం కేసు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తాజాగా చందానగర్ పోలీసులకు, స్థానిక ఏసీపికి ఫిర్యాదు చేశారు.
