
శేరిలింగంపల్లి, నిఘా24: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ రాజారాం కాలనీలో కాలనీ అధ్యక్షుడు షరీఫ్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ పాటుపడుతున్నారని ఆన్నారు. ముఖ్యంగా రైతుల కోసం రైతుబంధు, దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రానికి నీటి కొరత లేకుండా కాళేశ్వరం వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును అకుంటిత దీక్షతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని, నేడు తెలంగాణలోని రైతులు, ప్రజలు కాళేశ్వరం ఫలాలను అందుకుంటున్నారన్నారు.

ఐటి రంగంలో హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ లకు దక్కుతుందన్నారు. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు మౌలిక వసతుల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, నగరానికి కోట్లాది రూపాయల పెట్టుబడులను తీసుకువస్తున్న ఘనత బిఆర్ఎస్ పార్టీదన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఐటి సంస్థలతో కూడిన శేరిలింగంపల్లి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం వేలకోట్ల నిధులతో పనులు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగారెడ్డి, మల్లారెడ్డి, మల్లిఖార్జున్, దేవేందర్ రావు, సత్తయ్య, ఉమా మహేశ్వరరావులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.