
హైదరాబాద్, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెండుగా విడిపోయిన కమలం క్యాడర్ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయిన బీజేపీ నాయకులు నడిరోడ్డు మీద ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ దాడుల్లో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, 4 కార్లు ధ్వంసమయ్యాయి. మజీదుబండలో చోటు చేసుకున్న ఈ వివాదం మీద గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకులు పోరుబాట పట్టగా, శేరిలింగంపల్లిలో మాత్రం బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగుతున్నారు.

నాయకుల వర్గపోరుతో ఇప్పటికే కార్యకర్తలు సతమతం అవుతుండగా, నియోజకవర్గంలో రెండువర్గాల మధ్య విధిపోరాటాలు ప్రజల్లో పార్టీని పలుచన చేస్తున్నాయి. గతంలో గోపన్నపల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న వివాదాలను మర్చిపోకముందే తాజాగా మజీదుబండలో శుక్రవారం బీజేపీ నాయకుల మధ్య చోటుచేసుకున్న వివాదం సంచలనంగా మారింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీజేపీ నాయకులు యోగానంద్, రవికుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో రెండువర్గాలుగా విడిపోయి కొన్నిరోజులుగా వేరువేరుగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. యోగానంద్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మజీదుబండకు చేరుకుంది. మజీగుబండ రవికుమార్ యాదవ్ సొంత గ్రామం కాగా, యోగానంద్ పాదయాత్ర రవికుమార్ ఇంటి ముందుకు రావడంతోనే ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. సంఘటన స్థలంలో రవికుమార్ లేకపోగా, రవికుమార్ అనుచరులు, యోగానంద్ అనుచరుల మధ్య వివాదం పిడిగుద్దులకు దారితీసింది. ఈ గొడవలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో 4కార్లు ధ్వంసమయ్యాయి.

దీంతో యోగానంద్ వర్గం నాయకులు గచ్చిబౌలి పోలీసులకు రవికుమార్ అనుచరులు ఆదిత్య, అరుణ్ కుమార్ లతో పాటు మరో 15మందిపై పిర్యాదు చేశారు. పోలీసులు ఐపిసి సెక్షన్ 341,427,506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అధిష్టానం సీరియస్…
శేరిలింగంపల్లి బీజేపీ నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. సంఘటన మీద సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుందని తెలుస్తోంది. గతంలో సైతం శేరిలింగంపల్లి బీజేపీ లోని ఈ రెండు వర్గాల మధ్య వివాదాలు చోటు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, స్ట్రీట్ ఫైటింగ్ లకు దిగుతుండడంతో ప్రజల్లో పార్టీ పరువు మసకబారుతుందని రాష్ట్ర నాయకత్వం బావిస్తుంది.
