
హైదరాబాద్, నిఘా 24: ప్రముఖ ఆసుపత్రి అమర హాస్పిటల్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నూతనంగా స్లీప్ ఔట్ రీచ్ క్లినిక్ ను ప్రారంభించారు. గచ్చిబౌలి ఐటి కారిడార్ పరిధిలోని నానక్ రామగుడ అమర్ రాజా కార్పొరేట్ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను గురువారం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర హాస్పిటల్ ఎండి డాక్టర్ రమాదేవి గౌరినేని మాట్లాడుతూ సరైన నిద్ర లేకపోతే మనిషిని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని అన్నారు.

నిద్రలేమి బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుందన్నారు. విదేశాల్లో నిద్రలేమి సమస్య నివారణకు ఎన్నో ఆసుపత్రులు, క్లినిక్ లు అందుబాటులో ఉన్నాయని, మన దేశంలో ఈ సమస్యపై మరింత అవగాహన అవసరం అన్నారు. జీవనశైలి మార్పు, శారీరక శ్రమ లేని వారు నిద్రలేమితో బాధపడుతుంటారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ తో ప్రతినెలా రెండు, నాల్గవ వారం శుక్రవారం, శనివారం సేవలు అందిస్తామని తెలిపారు.