
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజిపూర్ గ్రామంలో ఉన్న పడుబడ్డ బావిలో తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. శ్రావణి మృతదేహం లాభమైన బావిలోనే గ్రామానికి చెందిన మనిషా మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏప్రిల్ 25వ తేదీన హాజిపూర్ కు చెందిన శ్రావణి అనే 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కాగా, గ్రామస్థులు ఆమె బ్యాగును ఓ పడుబడ్డ బావి వద్ద గుర్తించారు. పోలీసులతో కలిసి గాలింపు చేపట్టగా బావిలో శ్రావణి మృతదేహం లభ్యమైంది. శ్రవణిని దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె మృతదేహాన్ని పడుబడ్డ బావిలో పడవేశారు.
వెలుగుచూసిన మరో దారుణం ..
శ్రావణి హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. శ్రావణి మృతదేహం లభ్యమైన బావిలో మరో బ్యాగు కనిపించింది. బావిలో తవ్వకాలు చేపట్టగా గత రెండు నెలల క్రితం గ్రామంలో అదృశ్యమైన మనిషా మృతదేహం లభించింది. ఇంటర్ చదువుతున్న మనిషా గత రెండు నెలల క్రితం కనిపించకుండా పోగా ప్రియుడితో వెళ్ళిపోయి ఉంటుందని భావించారు. మనిషాను సైతం దుండగులు దారుణంగా హత్య చేసి బావిలో పడవేశారు. కాగా గ్రామంలో మరో విద్యార్థిని కల్పన సైతం అదృశ్యం కావడంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కొక్కటిగా దారుణాలు వెలుగు చేస్తుండడంతో హాజిపూర్ లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
