
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు నివసిస్తున్న గచ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రోపార్టిస్ విల్లా నెంబర్ 74 లో మంగళవారం ఉదయం సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలమయ్యాయని, గతంలో ఫిర్యాదుల నేపధ్యంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రఘురామ కృష్ణం రాజుకు చెందిన ఆఫీసులలో సైతం సిబిఐ సోదాలు జరిపినట్టు సమాచారం. కాగా ఈ విషయమై రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ తన ఇంట్లో ఎటువంటి సిబిఐ సోదాలు జరగలేదని, కేవలం స్టేట్ మెంట్ రికార్డ్ కోసమే అధికారులు వచ్చారని ఆయన తెలిపారు. పవర్ కార్పొరేషన్ బ్యాంకులో రుణం తీసుకున్నానని, వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పానని ఆయన పేర్కొన్నారు.
