
హైదరాబాద్: వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటుతున్నప్పుడు సెల్ ఫోన్ లు మాట్లాడుతూ, ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల అటెన్షన్ డైవెర్షనై ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డుపై వాహనాలు నడపుతూ వెనుక వచ్చే వాహనాలను పట్టించుకోవడం లేదు. మ్యూజిక్ జోష్‌లో వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. చాలామంది వాహన చోదకులు సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాహనాలను నడుపుతున్నారు. బాటసారులు కూడా పాటలు వింటూ మైమరిచిపోతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆటోలు, కార్లలో పెద్ద సౌండ్స్‌తో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోవడంతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇయర్ ఫోన్స్ తో డేంజర్…
ఇటీవల కాలంలో వాహన ఛోదకులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాహనాలు నడుపడం ఎక్కువయ్యింది. దీని కారణంగా వారంతట వారే ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. పాదచారులు కూడా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వెళుతున్నారు. వెనుక, ముందు నుంచి వచ్చే వాహనాలను గమనించకపోవడంతో ప్రమాదాల బారినపడుతున్నారు.
హెల్మెట్ లో సెల్‌ఫోన్..
హెల్మెట్ల వాడకం పెరిగిన తరువాత డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం మరింత సులభమైంది. సెల్‌ఫోన్‌ను హెల్మెట్ లోపల చెవిదగ్గర పెట్టి మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు. ఫోన్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపి మాట్లాడడం ఉత్తమం.
మ్యూజిక్ తో పారేషాన్…
యువతను హుషారెత్తించే రాకింగ్ మ్యూజిక్, మైమరిపించే పాటలు, ఎక్కువ డెసిబెల్స్ లో శబ్దాలు మిమ్మల్ని గందరగొలపరుస్తాయి. జోష్ లో వేగం పెరిగి యాక్సిడెంట్ లు జరుగుతున్నాయి.
కొన్ని సూచనలు..
- సెల్ ఫోన్ మన సౌకర్యానికి కనిపెట్టింది కానీ దాని మూలంగా మన ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కాదని గుర్తించాలి.
- ముఖ్యమైన ఫోన్ కాల్స్ కావచ్చు, మీ ప్రాణం కంటే ఎక్కువేం కాదు. కొంత సేపు రోడ్డు పక్కన వాహనన్ని నిలిపి ఫోన్లో సంభాషించాలి. లేదా కాల్ బ్యాక్ చేస్తే సరిపోతుంది.
- ఇటీవల కాలంలో నాయిస్ క్యాన్సలేషన్ ఇయర్ ఫోన్లు/ హెడ్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. వీటి వల్ల బయట శబ్దాలు అసలు వినిపించవు. ఈ తరహా ఇయర్ ఫోన్లు వాడుతూ రోడ్డు దాటడం, డ్రైవ్ చేయడం అత్యంత ప్రమాదకరం. నాయిస్ క్యాన్సలేషన్ వల్ల మనకు చుట్టూ పక్కన శబ్ధాలు వినిపించక యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
- అవసరం ఉంటేనే హెడ్ ఫోన్ లను ఉపయోగించాలి. అదీ డ్రైవ్ చేస్తూ, రోడ్ పై నడుస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు.
- రైలు పట్టాలు దాటే సమయంలో ఫోన్లో మాట్లాడడం,ఇయర్ ఫోన్లు వాడకపోవడం చేయరాదు.
- మెడ వంచి చెవికి, భుజానికి మధ్యన సెల్ ఫోన్ మాట్లాడుతూ టూవీలర్, కార్లు నడుపుతుంటారు. ఇలా డ్రైవ్ చేయడం ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది.
- డ్రైవింగ్ లో పూర్తి ఫోకుస్ డ్రైవింగ్, రోడ్ పై మాత్రమే ఉండాలి. పాటలు వింటూ, ఫోన్లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటడం, రోడ్లు దాటడం, వాహనాలు నడపడం వంటి చర్యలతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు.

