
హైదరాబాద్ : భయపడిందే జరిగింది… ఎక్కడో క్షేమంగా ఉంటుందనుకున్న హాజిపూర్ మూడవ బాలిక సైతం నరహంతకుడి చేతికి చిక్కి బలి అయ్యింది. సైకో శ్రీనివాస్ రెడ్డి వెల్లడిస్తున్న ఒక్కో విషయం విస్తుపోయేలా చేస్తోంది. నరహంతకుడి చేతిలో పడి హతమైన అమాయక బాలికల సంఖ్య మూడుకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం హాజిపూర్ లో అదృశ్యమైన కల్పన అనే బాలిక సైతం ఈ నరహంతకుడి చేతిలోనే హతమైంది. కల్పన ను అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డి తన పొలంలో ఉన్న మరో బావిలో పడవేశాడు. ఇప్పటికే ఒక బావి నుంచి శ్రావణి, మనిషా మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కల్పన ఆనవాళ్ల కోసం మరో బావిలో గాలింపు చేపట్టారు. కాగా గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నరహంతకుడు శ్రీనివాస్ రెడ్డి చేతిలో బలి కావడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పంటించి దహనం చేశారు. అతని కుటుంబ సభ్యులు పరారయ్యారు. హజిపూర్ కు చెందిన ముగ్గురు బాలికలతో పాటు స్థానికంగా ఉన్న ఫామ్ హౌస్ లో పనిచేసే ఓ బాలికను, ఆంధ్రప్రదేశ్ లో మరో మహిళను సైతం శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హతమార్చి నట్లు సమాచారం. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్న కొద్దీ ఒక్కో హత్య వెలుగు చూస్తుండడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

