
హైదరాబాద్: ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మోతీ నగర్‌లోని ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులు మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు. 1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి… శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య, ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. రాళ్లపల్లి తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలక్షణ నటుడ్ని కోల్పోయినందుకు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపల్లి పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.