
హైదరాబాద్ : ఐఐటీలో ర్యాంకు వస్తుందో రాదో అన్న భయం, ఇంటర్ లో బ్యాక్ లాగ్ సబ్జెక్టులతో మనస్థాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడ్ మెట్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఆర్మీ జవాను కుమారుడు సాహెల్ ఇంటర్ చదివాడు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ లో ఐఐటీలో కోచింగ్ తీసుకున్నాడు. మంగళవారం ఐఐటీ ఫలితాలు రావాల్సి ఉండగా, తనకు మంచి ర్యాంక్ రాదేమోనని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో పాటు ఇంటర్ లో కొన్ని బ్యాక్ లాక్ లు ఉండడంతో తండ్రి మందలించాడు. ఈ నేపద్యంలో అర్ధరాత్రి ఇంట్లో తన బెడ్ రూమ్ లోనే తండ్రి గన్ తో కాల్చుకుని సాహెల్ ఆత్మహత్య చేసుకున్నాడు.