
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఏబివిపి నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బోర్డు సెక్రెటరీ అశోక్ ను తొలగించాలని, విద్యాశాఖ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని, రీవాల్యుయేషన్ ఫీజు లేకుండా బాధిత విద్యార్థుల పేపర్లన్నీ వాల్యుయేషన్ చేయాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేసారు. ఇంటర్మీడియట్ బోర్డులో మార్కుల అవకతవకలకు పాల్పడిన కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. కాగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోశామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.