
శేరిలింగంపల్లి : ఆత్మీయ పలకరింపులు…ఆప్యాయంగా ఆలింగనాలు… ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ… చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ… సందడిగా సాగింది శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పాఠశాల స్థాయిలో చేసిన చిలిపిచేష్టలను నెమరేసుకుంటూ మూడున్నర దశాబ్దాల తర్వాత పాత మిత్రులు కలుసుకుని బావోద్వేగాలకు లోనయ్యారు.
శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు చందానగర్ లోని స్వాగత్ హోటల్ లో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులంతా ఉత్సాహంగా పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. అనంతరం తన చిరకాల గుర్తుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాఠశాల రోజుల్లో ఉపాధ్యాయులు, పదో తరగతి మిత్రులతో దిగిన ఫోటోను మెమొంటోల రూపంలో అందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అశోక్, మల్లారెడ్డి, కృష్ణా రెడ్డి, అరుణలత, విజయరాణి, పట్టాబిసీతారాణి, పద్మ, శ్రీలక్ష్మీ, సాజిరాబేగం, కమ్మర్ బేగం, పద్మావతి, ఉమాదేవి, బీమని శ్రీనివాస్, మేకల కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.