
హైదరాబాద్ : అవును.. శేరిలింగంపల్లిలో ఓ 333గజాల ప్లాటు చోరీకి గురైంది. అదేంటి భూమి దొంగతనం జరుగుతుందా..! అనుకుంటున్నారా.. ఇది నిజం. ఎప్పుడో 2013లో సూదర్శన్ నగర్ కాలనీలో ఓ వృద్ధురాలు కొనుగోలు చేసిన ప్లాటు లాక్ డౌన్ కాలంలో మాయమైంది. కాదు… ఓ పోలీసు అధికారి అల్లుడి దెబ్బకు కబ్జాకు గురైంది. ఏడేళ్లుగా తన స్వాధీనంలో ఉన్న రిజిస్ట్రేషన్ ప్లాటును గత సంవత్సరం తాను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్పి ఆక్రమించిన ఓ పెద్దమనిషి ఏకంగా నిర్మాణం చేపట్టడంతో వృద్ధురాలు లబోదిబోమంటుంది. పోలీసుల బంధుప్రీతి, జీహెచ్ఎంసి అధికారుల తప్పిదంతో తన ప్లాటు ఎక్కడ అంటూ దీనంగా చూస్తుంది. వివరాల్లోకి వెళ్తే… లింగంపల్లి డోయన్స్ కాలనికి చెందిన కేవీఎస్.లక్ష్మీ అనే వృద్ధురాలు 2013లో సుదర్శన్ నగర్ కాలనీలో గల సర్వే నెంబర్ 88/2,89/2లో 333గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. సదరు స్థలంలో ప్రహరీ కట్టి, విద్యుత్తు మీటర్ తీసుకొని, ఓ తోపుడు డబ్బా కు ఇచ్చింది. లాక్ డౌన్ కు ముందు హఠాత్తుగా ఓ వ్యక్తి వచ్చి సదరు ప్లాటు తనదని కబ్జాకు ప్రయత్నం చేశాడు. రాత్రికి రాత్రి బోరు వేసేందుకు ప్రయత్నించగా వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. కానీ అవతలి వ్యక్తి పోలీసు అధికారి అల్లుడు కావడంతో గచ్చిబౌలి పోలీసులు స్పందించలేదు. ఇంతలో సదరు వ్యక్తి తన పరపతి ఉపయోగించి జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతి తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ కాలంలో ఏకంగా నిర్మాణం మొదలుపెట్టాడు. అడ్డుకునేందుకు వెళ్తే పోలీసులే బెదిరిస్తున్నారని, ప్లాటు వద్దకు వెళ్తే అరెస్ట్ చేస్తామంటున్నారని వృద్ధురాలు వాపోతుంది. పిర్యాదు చేసేందుకు వెళ్తే ఓ పోలీస్ అధికారి ఫిర్యాదును నెలకేసి కొట్టాడని, రోజుల తరబడి తిరిగితే జిహెచ్ఎంసీ నిర్మాణ అనుమతి ఇచ్చారు కాబట్టి తాము ఏమి చేయలేమని చేతులు దులుపుకొన్నారని వాపోతుంది. ఇక జీహెచ్ఎంసి అధికారులు సైతం నిర్మాణ అనుమతిని రద్దు చేస్తామని నోటీసు ఇచ్చామని, నిర్మాణ పనులను అడ్డుకున్నామని అంటున్నారు. కోర్టుకు వెళ్లేందుకు సెలవులు… పోలీసులు న్యాయం చెయ్యరు… జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరు.. చేసేది లేక తన కొడుకుతో తన ప్లాటులో జరుగుతున్న నిర్మాణం ముందు ఆందోళన చేపట్టింది. సరైన పత్రాల పరిశీలన లేకుండ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం, ఉన్నతాధికారి ఒత్తిడితో పోలీసులు పట్టించుకోకపోవడంతో 80ఏళ్ల వయసులో వృద్ధురాలు రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకొని రోడ్డేక్కింది.